నేడు రాజ్యసభ ముందుకు రానున్న ఢిల్లీ సర్వీసుల బిల్లు

విపక్షాలు వ్యతిరేకించడం తప్పన్న కాంగ్రెస్‌ మాజీ ఎంపీ

Parliament Session: Amit Shah to move Delhi Services Bill in Rajya Sabha today

న్యూఢిల్లీ: నేడు రాజ్యసభ ముందుకు ఢిల్లీ అధికారాల బిల్లు రానుంది. ఈ బిల్లును కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. సభలో బిల్లకు వ్యతిరేకంగా ఓటేయాలనీ హస్తం పార్టీ నిర్ణయించింది. అయితే పార్టీ వైఖరిని సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టపిన బిల్లుకు మద్దతు పలికారు. ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించడం తప్పని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి.. అక్కడి ఆమోదం పొందింది. ఇప్పుడు ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే పెద్దసభలో అధికార పక్షానికి సరిపడినంత బలం లేదు. అయినప్పటికీ లోక్‌సభలోలా ఇతర పార్టీలు మద్దతిస్తే.. అది ఆమోదం పొందుతుంది. ఈ బిల్లును ప్రతిక్షాలు వ్యతిరేకించడం తప్పని సందీప్‌ దీక్షిత్‌ అన్నారు.

ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టే ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సోమవారం రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీతో పంతం నెగ్గించుకున్న అధికార బిజెపి.. రాజ్యసభలో మాత్రం కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. పెద్దలసభలో ఆ పార్టీకి తగిన బలం లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకుండా సీఎం కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ .. విపక్ష నేతల మద్దతు కూడగట్టింది. బిల్లుపై చర్చించి అనంతరం ఓటింగ్‌ నిర్వహిచనున్నారు. కాగా, రాజ్యసభలో ఎన్డీయేకు 106 మంది సభ్యుల బలం ఉన్నది. ఇక 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)కు 98 మంది సభ్యుల బలం ఉంది. ఏపార్టీతోనూ పొత్తులేనివారు మరో 29 మంది ఉన్నారు. వీరిలో బిఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికే ఆప్‌కు మద్దతు ప్రకటించారు. ఇక అధికార పార్టీకి బీజేడీ, వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి మద్దతు ప్రకటించాయి.