కేసీఆర్ పోరాడుతోన్న తీరు బాగుంది: కేసీఆర్‌కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఫోన్
నిన్న ఫోన్ చేశారని అధికారిక ప్రకటన

హైదరాబాద్ : బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్‌కు మాజీ ప్రధాని దేవెగౌడ మద్దతు ప్రకటించారు. తాజాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కూడా కేసీఆర్‌కు మద్దతు తెలిపారు.
నిన్న కేసీఆర్‌కు ఉద్ధవ్ ఫోన్ చేసినట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ నెల 20వ తేదీన ముంబై రావాలని, అన్ని అంశాలపై చర్చిద్దామని కేసీఆర్ కు ఉద్ధవ్ చెప్పారు. కేసీఆర్ పోరాడుతోన్న తీరు బాగుందని, తాము మద్దతుగా ఉంటామని ఆయన అన్నారు. కేసీఆర్‌ది న్యాయమైన పోరాటమని, విభజన శక్తులపై పోరాటానికి గళం విప్పారని, సరైన సమయంలో కేసీఆర్ ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాలని చెప్పారు. దేశ ప్రజలందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేందుకు తాము సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఉద్ధవ్ తెలిపారు. ఇద్దరం సమావేశమై రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని కేసీఆర్ తో ఉద్ధవ్ అన్నారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు 20న కేసీఆర్ ముంబయికి వెళ్లనున్నారు. ఇప్పటికే కేసీఆర్ దేశంలో పలు ఎన్డీయేతర పార్టీలతో చర్చించారు. ఎన్డీయే, యూపీయేతర కూటమి ఏర్పాటుపై కూడా చర్చలు జరుపుతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/