ఏపీలో ఇక అర్ధరాత్రి 12 దాకా హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్

ఆంధ్రప్రదేశ్ లో ఇక నుండి ఉదయం 5 నుండే బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర తినుబండారాల దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకూ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. రాష్ట్రంలో హోటల్‌ పరిశ్రమకు చెందిన సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2022 మార్చి 14 తేదీ నుంచి ఎలాంటి కొవిడ్‌ నిషేదాజ్ఞలు అమల్లో లేనందున హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 12 వరకూ తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మినహా ఇతర హోటళ్లు, ఈటరీస్‌ను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాలు – సంస్థల చట్టం 1988 సెక్షన్‌ 7ను అనుసరించి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

కోవిడ్‌ కారణంగా గతంలో ప్రభుత్వం రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆంక్షలు విధించింది. కోవిడ్‌ పరిస్థితులు చక్కబడటంతో వ్యాపార వేళల్ని అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించాలని కోరుతూ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఆలోచన చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మినహా హోటళ్ళు, రెస్టారెంట్లు, తినుబండారాల బళ్ళు అర్థరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకొనేందుకు అనుమతిచ్చింది. మంగళవారం నుంచి తాజా ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కోవిడ్‌ నిబంధనల ప్రకారం మాస్క్‌లు ధరించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా మూడు వేవ్‌లు పూర్తయ్యాయి. రెండు విడతల్లో 96 శాతం మేర వ్యాక్సినేషన్‌ను వైద్య ఆరోగ్యశాఖ పూర్తి చేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో హోటల్‌, రెస్టారెంట్ల వ్యాపారాలు క్రమేపీ పెరిగాయి. దీంతో అర్థరాత్రి వరకు అనుమతుల్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో రెస్టారెంట్లు, హోటళ్ళు జనాలతో కిక్కిరిసిపోనున్నాయి.