సింపుల్ గా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎంఎస్ ధోనీ..

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎలాంటి హడావిడి లేకుండా సామాన్య ఓటరు మాదిరి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకొని వార్తల్లో నిలిచాడు. దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ఉదయం నుండి ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిలో మొత్తంగా 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విడతలోనే హరియాణాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు, దిల్లీలో ఉన్న మొత్తం 7 సీట్లకూ, జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి, ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, బిహార్ 8, బంగాల్ 8, ఒడిశా 6, ఝార్ఖండ్ 4 స్థానాలకు పోలింగ్ జరగుతుంది. రాజకీయ పార్టీల నేతలంతా ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీపడ్డారు.

ఇక రాంచీలోని పోలింగ్ స్టేషన్‌లో MS ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వచ్చిన ధోనిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే అక్కడున్న కొందరు ఆయనను పోలింగ్ స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. ఓటేసిన అనంతరం ధోని కారులో వెళ్లిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరని విషయం తెలిసిందే. చెన్నై లీగ్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఆదివారం (మే 19) నాడు ఎంఎస్ ధోనీ బెంగళూరు నుండి రాంచీ బయలుదేరాడు. 42 ఏళ్ల ధోనీ ఐపీఎల్ 2024లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించారు. ఐపీఎల్ 2024లో 73 బంతుల్లో 220.55 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశారు. గాయంతో బాధపడుతున్న ధోనీ.. వచ్చే సీజన్ ఆడతాడో లేదో చూడాలి.