రేపు కర్ణాటకలో ‘శక్తి యోజన’ స్కీంను ప్రారంభించనున్న సీఎం

మహిళలకు ఉచిత ప్రయాణం .. స్వయంగా స్మార్ట్ కార్డులు పంచనున్న సిద్ధరామయ్య

Siddaramaiah to turn bus conductor on June 11 to inaugurate ‘Shakti’ scheme

బెంగళూరుః కర్ణాటక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం ఆదివారం నుంచి ప్రారంభించనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సిద్ధరామయ్య సర్కారు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం ‘శక్తి యోజన’ ను స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన కండక్టర్ అవతారం ఎత్తనున్నారు. బెంగళూరులో మెజిస్టిక్ బస్ స్టేషన్ నుంచి విధాన సౌధ రూట్ లో నడిచే బస్సులో కండక్టర్ గా మారనున్నారు.

బస్సులో స్వయంగా మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీఎంటీసీ బస్సుకు సిద్ధరామయ్య కండక్టర్‌గా వ్యవహరిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రూట్ నెం.43లో బస్ కండక్టర్ గా మహిళలకు స్మార్ట్ కార్డులు అందజేస్తారని, అనంతరం విధానసౌదలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శక్తి యోజనను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. ఏకకాలంలో జిల్లాల్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.