వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీ తీర్మానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు

జగన్ శాశ్వత సీఎం అని అంసెబ్లీలో తీర్మానం చేస్తారేమోనని ఎద్దేవా చేసిన రఘురామ

MP Raghurama krishna Raju
MP Raghurama krishna Raju

అమరావతిః సిఎం జగన్‌ వైఎస్‌ఆర్‌సిపి శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగించాలని వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీలో చేసిన తీర్మానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. దేశంలో రాజకీయ పార్టీలకు కొన్ని నిబంధనలు ఉంటాయని, వాటి మేరకు నడుచుకుంటామని పార్టీలు ముందే అంగీకార పత్రం ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఇష్టారీతిగా వ్యవహరిస్తామంటే కుదరదని ఇదే విషయమై తాను ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారికి లేఖ రాసినట్టు వెల్లడించారు.

ఒకవేళ రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడి ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ అంగీకరిస్తే… అన్ని పార్టీలకు జగన్‌ మార్గదర్శిగా నిలుస్తారని అన్నారు. మరో పాతికేళ్ల పాటు ముఖ్యమంత్రి జగనే అని వైసీపీ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసినా ఆశ్చర్యం లేదని రఘురామ ఎద్దేవా చేశారు.

ఇక, తన గురించి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ను, ఆ భాషను చూసిన ప్రజలు మళ్లీ వైసీపీకి ఓటే వేయరని రఘురామ అన్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పయ్యావుల కేశవ్‌కు రక్షణ సిబ్బందిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. కానీ, ఆయన కదలికలు తెలుసుకోవడానికి సిబ్బందిని మార్చి, తమ వాళ్లను నియమించే అవకాశం ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/