సంజ‌య్ రౌత్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తా : న‌వనీత్ కౌర్

న‌న్ను 20 అడుగుల లోతులో పూడ్చేస్తాన‌న్నారు..న‌వనీత్ కౌర్ ఆరోప‌ణ‌

ముంబయి: హ‌నుమాన్ ఛాలీసా వివాదం నేప‌థ్యంలో శివ‌సేన నేత‌లు, స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి నుంచి ఎంపీగా గెలిచిన న‌వ‌నీత్ కౌర్‌ల మ‌ధ్య పోట్లాట తారస్థాయికి చేరింది. త‌న‌ను 20 అడుగుల లోతులో పూడ్చేస్తాన‌ని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ అన్నార‌ని, ఆయ‌న‌పై తాను పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు న‌వనీత్ కౌర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ మేర‌కు న‌వ‌నీత్ చేసిన ఆరోప‌ణ‌ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

హ‌నుమాన్ ఛాలీసా ప‌ఠనానికి సంబంధించి న‌వ‌నీత్ కౌర్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఈ వివాదం రేగ‌గా… ఆమెతో పాటు ఆమె భ‌ర్త ఎమ్మెల్యే ర‌వి రాణాపై విద్వేష వ్యాఖ్య‌ల కేసును న‌మోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ముంబై సెష‌న్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఇటీవ‌లే వారు విడుద‌ల‌య్యారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం మీడియా ముందుకు వ‌చ్చిన న‌వనీత్… సంజ‌య్ రౌత్‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు.

శివ‌సేన త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న సంజ‌య్ రౌత్ స్వ‌యంగా త‌న‌ను 20 అడుగుల లోతులో పాతేస్తాన‌న్నార‌ని న‌వనీత్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎంపీలుగా కొన‌సాగుతున్న నేత‌ల నుంచి ఇలాంటి బెదిరింపులు వ‌స్తాయా? అని ఆమె ప్ర‌శ్నించారు. ఓ గూండా మాదిరిగా త‌న‌పై బెదిరింపుల‌కు దిగిన రౌత్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు కౌర్ ప్ర‌క‌టించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/