ప్రజలే మీ అవినీతి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తారుః సీఎం రమేశ్

తనపై సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన రమేశ్

CM-ramesh

హైదరాబాద్ః బిజెపి నేత, ఎంపీ సిఎం రమేశ్‌ సిఎం కెసిఆర్‌ పై విమర్శలు గుప్పించారు. గత రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ తన పేరు ప్రస్తావించి, కేసుల భయంతోనే తాను బీజేపీలో చేరినట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడరన్నారు. తనపై ఒక్క సీబీఐ, ఈడీ కేసు నమోదు కాలేదన్నారు. ఉన్నట్టు చూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. గతంలో కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారన్నారు. తమ వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీలో చేరిన తనను ‘వాషింగ్ మిషన్’ అని ప్రస్తావించడంపై రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలే మీ అవినీతి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తారని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్మీట్ లో నా పేరు ప్రస్తావించి నేనేదో కేసుల భయంతో బీజేపీలో చేరినట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. నా మీద ఒక్క సీబీఐ, ఈడీ కేసు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధిన కేసు కానీ లేదు. మీరు ఉన్నట్టు చూపిస్తే నేను దేనికైనా సిద్దం!. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారంతో మాట్లాడితే బాగుంటుంది. గతంలో మీ కుమారుడు కేటీఆర్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఇప్పటికైనా మీ వ్యాఖ్యలు సరి చేసుకుంటారని భావిస్తూ.. ప్రజలకు వాస్తవాలు మాత్రమే చెప్పాలని విన్నవిస్తున్నాను’ అని వరుస ట్వీట్లు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/