అమర్‌నాథ్‌లో పెను విషాదం.. ఇద్దరు ఏపీ మహిళలు మృతి

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు ఏపీ మహిళలు మృతి చెందారు. శుక్రవారం అమర్‌నాథ్‌ గుహవద్ద భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వందలాదిమంది వరదల్లో చిక్కుకున్నారు. ఈ వరదల దాటికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుధ మృతదేహాన్ని భర్త విజయ్‌ కిరణ్‌ గుర్తించారు. భౌతిక కాయాలను స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న యాత్రికుల్లో 20 మంది ఆదివారం సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి వారు స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. మిగతావారిని సోమవారం ఉదయం రైలులో చండీగఢ్‌ నుంచి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ భవన్‌ అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు వరదల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 18కి చేరుకుంది. ప్రస్తుతం ఆకస్మిక వర్షం, వరదలతో అల్లకల్లోలంగా మారిన అమర్‌నాథ్‌ క్షేత్రం సమీపంలో సహాయ, పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ఈ పనులను నిర్వహిస్తోంది. రెండ్రోజుల క్రితం ఎగువన పర్వత ప్రాంతాల్లో ఆకస్మికంగా వర్షం కురవడం.. అది పెను వరదగా అమర్‌నాథ్‌ క్షేత్రం బేస్‌ క్యాంప్‌లోకి పోటెత్తడంతో అక్కడ భక్తులు వేసుకున్న టెంట్లు, వంటశాలలు కొట్టుకుపోవడం జరిగింది.