డీజీపీకి లేఖ రాసిన బిజెపి బహిష్కృత నేత రాజా సింగ్

బక్రీద్​కు ఆవులు, దూడలను కోస్తే ఊరుకోమంటూ ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరిక

mla-raja-singh-warned-the-government-not-to-kill-cows-and-calves-for-bakrid

హైదరాబాద్‌ః గోషామహల్ ఎమ్మెల్యే, బిజెపి బహిష్కృత నేత రాజా సింగ్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోబోమన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం వాటిని హింసించకూడదని ఆయన గుర్తు చేశారు. మేకలు, గొర్రెలు కోసుకొని బక్రీద్ చేసుకుంటే మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ మేరకు రాజా సింగ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఈనెల 27న బక్రీద్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆవులు, దూడల రక్షణకు చర్యలు చేపట్టలేదన్నారు. కనీసం చెక్ పోస్ట్ లను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే ఆవులు, దూడలను రక్షించుకునేందుకు తామే రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కు, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నానని తెలిపారు. ‘మీరు చర్యలు తీసుకోకపోతే మా బృందాలు రంగంలోకి దిగుతాయి. ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.