రేవంత్ తో నాకు ప్రాణహాని- మోత్కుపల్లి

లోక్​సభ ఎన్నికల వేళ కాంగ్రెస్​ నేత మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​తో తనకు ప్రాణహాని ఉందని మోత్కుపల్లి అన్నారు. ‘రేవంత్ కారణంగానే మాదిగలకు ఎంపీ టికెట్ రాలేదు. దీంతో మాదిగలు 50ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు. మాల సామాజిక వర్గం కంటే ఎక్కువ ఉన్నా ఒక్క టికెట్ కూడా మాకు కేటాయించలేదు. రేవంత్ అంటే ఏంటో కేవలం 100 రోజుల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. ప్రతిపక్షంలో ఉండగా అక్రమంగా రూ.కోట్లు సంపాదించుకున్నారు’ అని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలు రెడ్డిలకే ఇచ్చారని, బలహీనవర్గాల నేతలు పార్లమెంటుకు పోవద్దా అని ప్రశ్నించారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారని ప్రశ్నించారు. రెడ్డి రాజ్యాన్ని స్థాపించడమే రేవంత్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ మాదిగలకు రెండు టికెట్లు ఇచ్చారు.. కాంగ్రెస్‌ ఒక్క టికెట్‌ ఇవ్వలేదన్నారు. ఇది సోనియా కాంగ్రెస్‌ కాదని.. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అని చెప్పారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి అని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. దేవుళ్లపై ఒట్లు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దళితబంధు పేరిట కేసీఆర్ రూ.10 లక్షలిస్తే.. మేం రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని…. కానీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలవ్వడం లేదన్నారు. మాదిగలు, బలహీనవర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దని పిలుపునిచ్చారు.