కరీంనగర్ లో దారుణం : ఇంట్లో నిద్రిస్తున్న మహిళలపై దుండగుల దాడి

Crime in karimnagar
Crime in karimnagar

కరీంనగర్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని రామకృష్ణకాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై దుండగులు కత్తితో దాడిచేశారు. దీంతో కూతురు మరణించగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రామకృష్ణ కాలనీలో బాలవ్వ, సులోచన అనే తల్లీకూతుళ్లపై గురువారం అర్ధరాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సులోచన అక్కడికక్కడే మృతిచెందగా.. రక్తపు మడుగుల్లో పడి ఉన్న బాలవ్వను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాలే ఈ దాడికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.