జవహర్‌లాల్ నెహ్రూ కారు డ్రైవర్ మోనప్పగౌడ మృతి

దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారు డ్రైవర్, స్వాతంత్ర్య సమరయోధుడు మోనప్పగౌడ కోరంబడ్క తుదిశ్వాస విడిచారు. 102 సంవత్సరాల మోనప్పగౌడ సంబంధిత సమస్యలతో బాధపడుతూ కర్ణాటక రాష్ట్రం దక్షిణకన్నడ జిల్లా సుళ్య తాలూకా కనకమజలు గ్రామంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు. ఆయనకు కుమారుడు వెంకటరమణ, ముగ్గురు కుమార్తెలు కమల, విమల, కుసుమ ఉన్నారు.

స్వాతంత్య్ర పోరాట సమయంలో స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూకు గౌడ సహాయకుడిగా ఉన్నాడు, ఆయన నెహ్రూ కారు డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. నవలా రచయిత శివరామ్‌ కారంత్‌, మాజీ ఎంపీ శ్రీనివాస్‌ మాల్యా, మాజీ ముఖ్యమంత్రి కెంగల్‌ హనుమంతయ్యలకు కూడా ఆయన పనిచేసాడు. మోనప్పగౌడ తాజ్ హోటల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి నెహ్రూను మంగళూరు విమానాశ్రయం నుండి పికప్ చేసాడు. ఆయన డ్రైవింగ్ నైపుణ్యానికి ముగ్ధుడయిన నెహ్రూ అతనిని వ్యక్తిగత డ్రైవర్‌గా నియమించుకున్నారు. మోనప్పగౌడ మరణం పట్ల రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.