రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

నేడు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

parliament-budget

న్యూఢిల్లీః పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రేపు (గురువారం) ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభల సమావేశాలకు ముందు అఖిల పక్షం సమావేశం కావడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధానమంత్రి, కేంద్ర సీనియర్ మంత్రులు, వివిధ పార్టీ పార్లమెంటరీ పక్ష నేతలు ఈ సమావేశానికి హాజరవుతుంటారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మంగళవారమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కానీ, చాలా పార్టీల నాయకులు అందుబాటులో లేకపోవడంతో అది ఈ రోజుకు వాయిదా పడింది. అఖిల పక్ష భేటీ గురించి చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన కేబినెట్ సహచరులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్‌తో నిన్న సమావేశమయ్యారు.

కాగా, ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బిజెపి, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దాడులకు దిగడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా మారనున్నాయి. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి సమస్యలతో పాటు మణిపూర్ సంక్షోభంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. గత సెషన్ కూడా తరచూ విపక్షాల నిరసనలతో హోరెత్తింది.