అమ‌లాపురం అల్ల‌ర్ల బాధితుల ప‌రామ‌ర్శకు వీర్రాజు..అడ్డుకున్న పోలీసులు

వీర్రాజు కారుకు అడ్డంగా మ‌రో కారును ఉంచిన పోలీసులు
పోలీసుల తీరుపై వీర్రాజు ఆగ్ర‌హం


అమరావతి: ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో బుధ‌వారం హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇటీవ‌లే అల్ల‌ర్లు చెల‌రేగిన కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజును పోలీసులు తూర్పు గోదావ‌రి జిల్లా జొన్నాడ స‌మీపంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎక్క‌డ సోము వీర్రాజు కారు దూసుకుపోతుందోన‌న్న అనుమానంతో పోలీసులు ఆయ‌న కారుకు ఓ కారును అడ్డుగా ఉంచేశారు. దీంతో పోలీసుల తీరుపై వీర్రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు, వీర్రాజు మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

అమ‌లాపురం అల్ల‌ర్ల‌లో గాయ‌ప‌డ్డ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళుతున్న త‌న‌ను అడ్డుకోవ‌డ‌మేమిట‌ని వీర్రాజు ప్ర‌శ్నించారు. అల్ల‌ర్ల నేప‌థ్యంలో ఇంకా పోలీసు ఆంక్ష‌లు కొన‌సాగుతున్న అమ‌లాపురంలో ప్ర‌ముఖుల ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తించ‌లేమ‌ని పోలీసులు ఆయ‌న‌కు తేల్చిచెప్పారు. కనీసం త‌మ పార్టీ నేత‌ల‌నైనా క‌లిసేందుకు అనుమ‌తిస్తారా? అని వీర్రాజు అడగ‌గా… బ‌య‌టి వ్య‌క్తుల‌ను అమ‌లాపురంలోకి అనుమ‌తించ‌బోమంటూ పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో రావుల‌పాలెంలోని త‌మ పార్టీ నేత త‌ల్లి ఇటీవ‌లే మ‌ర‌ణించార‌ని, క‌నీసం ఆ నేత కుటుంబం ప‌రామ‌ర్శ‌కు అయినా అనుమ‌తిస్తారా? అని వీర్రాజు అడ‌గ‌గా… రావుల‌పాలెం వ‌ర‌కు అయితే అనుమతిస్తామని పోలీసులు చెప్ప‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/