విజయవాడలో రెండేళ్ల చిన్నారిలో మంకీ పాక్స్ లక్షణాలు..

విజయవాడలో రెండేళ్ల చిన్నారిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడం ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను , ప్రజలను షాక్ కు గురి చేసింది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గకముందే మరోమహమ్మారీ దేశంలోకి ప్రవేశించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్‌ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి కేసు కేరళలో వెలుగు చూసింది. వైరస్‌ సోకిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టింది అక్కడి వైద్యశాఖ.

ప్రస్తుతం కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు.. జ్వరం, జబ్బులున్న వాళ్లతో సన్నిహితంగా ఉండొద్దని పేర్కొంది. అలాగే.. ఎలుకలు, ఉడుతలు, వన్యప్రాణులు, ఇతర జీవులకు దూరంగా ఉండాలని, అడవి జంతువుల మాంసం విషయంలో, ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తా ఉండాలని సూచించింది. ఆఫ్రికా నుంచి దిగుమతి అయిన వణ్యప్రాణి సంబంధిత ప్రొడక్టులు.. లోషన్లు, క్రీమ్‌లు, పౌడర్లకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వాళ్లు వాడినవి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన జంతువులకు దూరంగా ఉండడం తప్పనిసరి. జ్వరం, దద్దర్లు లాంటి మంకీపాక్స్‌ సంబంధిత లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్య సిబ్బందిని సంపద్రించాలని పేర్కొంది.

ఇక ఇప్ప్డుడు ఏపీలోని విజయవాడ లో రెండేళ్ల చిన్నారిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. ఇటీవలే ఆ చిన్నారి కుటుంబం దుబాయ్ నుంచి విజయవాడకు వచ్చింది. ఆమె ఒంటిపై ఓ రకమైన దద్దుర్లు, జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి చర్మంపై దద్దుర్లను, ఇతర లక్షణాలను పరిశీలించిన వైద్యులు.. అవి మంకీ పాక్స్ లక్షణాల తరహాలో కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్ కు తరలించారు.

విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారిని ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చిన్నారి నుంచి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించినట్టు వెల్లడించాయి. చిన్నారికి సోకినది మంకీ పాక్స్ వైరసా, మరేదైనా అయి ఉంటుందా అన్నది ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందని తెలిపాయి.