వరద నష్టాలపై ఆర్థికసహాయం చేయాలని కేంద్రానికి ఎంపీ విజయసాయి డిమాండ్

గత పది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో భారీగా నష్టం వాటిల్లిందని , ఈ క్రమంలో రాష్ట్రానికి వరద నష్టాన్ని అందించాలని వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు హాజరయ్యారు.

కాగా, అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ పరిహారాన్ని ఐదేళ్లు పొడిగించాలని , ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరపాలని కోరామని ఆయన వెల్లడించారు. పోలవరంపై రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు విడుదల చేయాలని, మహిళ రిజర్వేషన్ల బిల్లు ఈ సమావేశాల్లోనే పెట్టాలని కోరామని అన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని , జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థులకు సీట్ల అంశాన్ని లేవనెత్తామని తెలిపారు. ముఖ్యంగా గత వారం రోజులుగా వర్షాలు, వరదలతో ఏపీలోని గోదావరి తీర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన వివరించారు. వరద నష్టాలపై ఆర్థికసహాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.