ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

దేశ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. ఉదయం నుండే దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. ప్రతి చోటా విగ్రహ ప్రతిష్ఠాపన, ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భక్తిలో మునిగిపోయారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. శుభాకాంక్షలు చెప్పారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడని తెలిపారు సీఎం జగన్‌. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. ఇక అటు వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని కేసీఆర్ అన్నారు.