బేగం పేట్ కు చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ పర్యటన లోభాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానం లో ఢిల్లీ నుండి బేగంపేట కు చేరుకున్న అయనకు తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నర్ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నేతలు ప్రధానికి గ్రాండ్ గా స్వాగతం పలికారు.

బేగంపేట్ విమానశ్రయం నుంచి నేరుగా మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనునన్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బేగంపేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు. రైల్వే స్టేషన్ లో సెక్యూరిటీ పటిష్టం చేశారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. ప్లాట్ ఫాం టికెట్ల జారీని అధికారులు నిలిపివేశారు. కేవలం ప్రయాణికులను మాత్రమే తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. రైల్వే స్టేషన్ మొత్తం భద్రతా బలగాల ఆధీనంలో ఉంది.

ఇక ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ప్రధాని బయలుదేరే ముందు తెలుగులో ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇతర అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు, కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తామని వెల్లడించారు. సుమారు రెండు గంటలసేపు నగరంలో పర్యటించనున్న ప్రధాని రూ.11 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.