హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు గూగుల్ తో చెక్ పెట్టబోతున్నారు

హైదరాబాద్ లో ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏ వైపు కు వెళ్లిన గంటల సమయం ట్రాఫిక్ లోనే గడిచిపోతుంది..అంతెందుకు నగరవాసి రోజులో సగం సమయం ట్రాఫిక్ లోనే గడిచిపోతుంటుంది. అలాంటి ట్రాఫిక్ సమస్య ను చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు గూగుల్ సాయం తీసుకోబోతున్నారు. గూగుల్ సంస్థ ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను వినియోగించడం ద్వారా అనుకోకుండా జరిగే సంఘటనలు, ర్యాలీలు, ధర్నాలు, వీవీఐపీల రాకలకు సంబంధించి అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే ట్రాఫిక్ జామ్ ల ప్రభావాన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు సమాచారం అందించే విధంగా గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ చేయనున్నారు.

దీని కోసం ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు, ఎస్ఐల మొబైల్ ఫోన్లను ఈ యాప్ను ఇన్స్టాల్ చేసి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసేలా చొరవ తీసుకోనున్నారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావడం తో పాటుగా ప్రతిరోజు 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఈ యాప్ పనితీరును పర్యవేక్షిస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ట్రాఫిక్ పోలీసులు మొబైల్ యాప్ లో ఫోటోలు తీసిన, వివరాలు పంపినా ఆ సమాచారం కమాండ్ కంట్రోల్ కు వెళ్లి గూగుల్ మ్యాప్ లో చూస్తున్న వారందరికీ అప్డేట్ అయి కనిపిస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వెళ్లే వారికి ఏ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. ఏ ఏరియా లో రోడ్లు ఫ్రీగా ఉన్నాయన్న సమాచారం తెలుస్తుంది. దీంతో ఏ రూట్ లో వారు ప్రయాణం చెయ్యొచ్చో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.