మరికాసేపట్లో ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..ఈరోజు రెండోసారి ఈడీ ముందు హాజరుకాబోతున్నారు. ఈ నెల 11న ఈడీ ముందు హాజరైన కవితను అధికారులు సుమారు 9 గంటల పాటు ప్రశ్నించారు. 16వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ ముందు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. లిక్కర్‌ పాలసీ రూపకల్పన, సౌత్‌గ్రూపు పాత్ర, ఆప్‌ నేతలకు ముడుపులు తదితర అంశాలపై ప్రశ్నించడంతో పాటు బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైతో కలిపి విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరినీ విచారించారని.. సాక్ష్యాల ధ్వంసం, మద్యం విధాన రూపకల్పన, హోటళ్లలో భేటీ వంటి అంశాలపై లోతుగా ప్రశ్నించారని సమాచారం.

మరోవైపు, కవితను ఈడీ రెండో సారి విచారించనున్న నేపథ్యంలో తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకోవైపు, తన చెల్లెలు కవితకు తోడుగా ఉండేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు ఢిల్లీకి చేరుకోవడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ మరింత పెరుగుతోంది.