జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ నేత , ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై పై కౌశిక్ అనుచిత వాఖ్యలు చేసినందుకు సుమోటోగా స్వీకరించి ఆయనకు నోటీసులు జారీ చేసింది జాతీయ మహిళా కమిషన్. ఈ క్రమంలో ఆయన ఈరోజు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.

గత నెల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని చెబుతూ అసభ్య పదజాలం ఉపయోగించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదన్నారు. అది తెలంగాణలో సాధారణంగా వాడే పదాలని చెప్పుకొచ్చారు. ఒక్క పదాన్ని కాదు.. మొత్తం విషయాన్ని విని అర్థం చేసుకోవాలన్నారు. తానూ చేసిన వ్యాఖ్యలు తప్పయితే ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్‌ కామెంట్స్‌కి ఉమెన్‌ కమిషన్‌ ఎందుకు స్పందించలేదని కౌశిక్‌ ప్రశ్నించారు.