బిఆర్ఎస్ లో అసమ్మతి సెగ మొదలు..అజ్మీరా రేఖా నాయక్ రాజీనామా..?

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ లో అసమ్మతి సెగ మొదలైంది. సోమవారం పార్టీ అధినేత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 119 మందికి గాను 115 అభ్యర్థులను ప్రకటించారు. మరో నలుగుర్ని హోల్డ్ లో పెట్టారు. ఈ క్రమంలో టికెట్ దక్కని వారు అధికార పార్టీ కి రాజీనామా చేసి..మరో పార్టీ వైపు చూస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న బీఆర్ఎస్ మ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్.. పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆమెకు టికెట్ దక్కలేదు.

దీనితో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్.. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ థాకరేను కలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. దీనితో ఇక రేఖా నాయక్ కూడా కాంగ్రెస్‌లో చేరొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి రేఖా నాయక్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2014, 2018లో భారీ మెజారిటీతో తన ప్రత్యర్థి రమేష్ రాథోడ్‌ను మట్టికరిపించారు. 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున రమేష్ రాథోడ్ పోటీ చేసి, రేఖా నాయక్ చేతిలో ఓటమి చవి చూశారు.