కేసీఆర్ ముసుగు తీస్తాం అంటూ జేపీ నడ్డా వార్నింగ్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని బిజెపి శ్రేణులు అనుకున్నారు. దానికోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు వచ్చారు. కానీ కోవిడ్ నిబంధనల దృష్ట్యా క్యాండిల్ ర్యాలీ జరపకుండా సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భాంగా తెరాస ప్రభుత్వంఫై జేపీ నడ్డా విరుచుకపడ్డారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వ పాలన కొనసాగుతోందని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలో రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా జీవో 317 తెచ్చారని నడ్డా చెప్పారు. జీవోకు వ్యతిరేకంగా శాంతియుతంగా జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
‘దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓటమి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే నియంతృత్వ పోకడలకు వెళ్తున్నారు. ధర్నాచౌక్ వద్ద ధర్నాలు వద్దన్న తెరాస నేతలే ధర్నాచౌక్‌లో నిరసన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎం మాదిరి వాడుకున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఒక్క నీటిచుక్క ఇవ్వలేదు. హుజూరాబాద్ రుచిని రాష్ట్రమంతా తెరాసకు చూపిస్తాం.’ అన్నారు. త్వరలోనే కేసీఆర్ ముసుగు తీస్తామని జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు.