సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

గత కొద్దీ రోజులుగా ఏపీ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా వాటిని వదిలేసి ప్రభుత్వం..సినిమా టికెట్స్ ధరల ఫై ఫోకస్ పెట్టడం ఏంటి అని సినిమా వాళ్లే కాదు సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే దానిపై చర్చలు జరుగుతుండగా..చివరికి ఈరోజు దీని ఫై మాట్లాడేందుకు వర్మ కు అపాయింట్మెంట్ ఇచ్చారు మంత్రి పేర్ని నాని. ప్రస్తుతం సచివాలయంలో వీరిద్దరి మధ్య భేటీ నడుస్తుంది.

ఈ భేటీ ఇలా ఉండగానే వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చిత్రసీమ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ ..అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా? అని ప్రశ్నించారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన సమర్ధించుకున్నారు. సోమవారం కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సినిమా వాళ్ల గురించి మాట్లాడారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్‌లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. బలిసి కొట్టుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ప్రసన్నకుమార్ ఇలాగే పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.