ర్యాగింగ్ పై మంత్రి రజనీ కీలక ఆదేశాలు..

ప్రభుత్వాలు , కాలేజ్ యాజమాన్యాలు ర్యాగింగ్ ఫై ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కొన్ని కాలేజీల్లో ర్యాగింగ్ అనేది జరుగుతూనే ఉంది. తాజాగా వరంగల్ లో మెడిసిన్ చేస్తున్న ప్రీతీ అనే విద్యార్థి.. సీనియర్ వేదింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఏపీలోనూ ర్యాగింగ్ ఫై అప్రమత్తం అయ్యారు. ర్యాగింగ్ విష‌యంలో రాష్ట్రంలోని అన్ని మెడిక‌ల్ క‌ళాశాల‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశాలు ఇచ్చారు.

మెడికోల‌పై ఎక్క‌డా, ఎలాంటి వేధింపులు ఉండ‌టానికి వీల్లేద‌న్నారు. క‌ళాశాల‌ల్లోని యాంటీ ర్యాగింగ్ క‌మిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా ప‌నిచేయాల‌న్నారు. ర్యాగింగ్‌, ఇత‌ర వేధింపుల‌కు సంబంధించి ఆయా క‌ళాశాల‌ల‌పై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివ‌ర్సిటీ వీసీ ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు. ఆయా క‌ళాశాల‌ల నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు యాంటి ర్యాగింగ్ క‌మిటీల ద్వారా నివేదిక‌లు తెప్పించుకుంటూ ఉండాల‌న్నారు. కొంత‌మంది సీనియ‌ర్ అధ్యాప‌కులు వారి సొంత క్లినిక్‌ల నేప‌థ్యంలో పీజీ విద్యార్థుల‌పై ప‌నిభారం మోపే పద్ధతి మారాలన్నారు. చ‌దువుల్లో నాణ్య‌తే కాద‌ని, భ‌ద్ర‌త కూడా ఉండాల‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని చెప్పుకొచ్చారు. ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేలా విద్యార్థుల‌కు యోగా, ధ్యానం లాంటి అంశాల‌పై అవ‌గాహ‌న పెంచాల‌న్నారు. ముఖ్య‌మైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాల‌న్నారు. ప్ర‌తి విద్యార్థిని దిశ యాప్ ను వాడుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. సీనియ‌ర్‌, జూనియ‌ర్ విద్యార్థుల‌కు ప్ర‌త్యేక వ‌స‌తి ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. వారి భోజ‌న స‌మ‌యాలు కూడా ఒకేలా ఉండ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు.