వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షలు ప్రకటించిన GHMC

హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో గత ఆదివారం వీధికుక్కలు దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ బాలుడి కుటుంబానికి GHMC.. రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈరోజు మంగళవారం హైదరాబాదులో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అఖిలపక్ష కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.8 లక్షలు ప్రకటించగా, కార్పొరేటర్లు తమ ఒక నెల వేతనంతో మరో రూ.2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, కుక్కల నివారణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మరోపక్క వీధి కుక్కల విషయంలో GHMC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్​తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల బెడద నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

కుక్కల సంతాన నియంత్రణ ప్రక్రియను వేగవంతం చేయాలని… ఫిర్యాదు చేయగానే చర్యలు తీసుకునే యంత్రాంగం ఉండాలని ఆదేశించారు. అలాగే, జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కల బెడదపై 040 21111111 నంబరుకు ఫోన్‌ చేసిన వెంటనే తగిన చర్యలు తీసుకునేలా, మైజీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు చేశారు.