“టోల్ చార్జీల పెంపు”పై నితిన్ గడ్కరీకి లేఖ రాసిన మంత్రి వేముల

ఏప్రిల్ 01 నుండి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) టోల్ చార్జీలు భారీగా పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలవుతాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ ధరలను 10 రూపాయల నుండి 60 రూపాయల వరకు పెంచనున్నారు.

కాగా ఈ టోల్ చార్జీల పెంపు ఫై కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ ప‌రిధిలోని నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కు సంబంధించి 32 టోల్‌గేట్ల ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం వ‌సూలు చేసే ట్యాక్స్ మ‌ళ్లీ పెంచ‌తున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే కేంద్రం వ‌సూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పెనుభారంగా మారింది.

టోల్ ట్యాక్స్ పెంపుద‌ల నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 2014లో రూ. 600 కోట్లు టోల్ ట్యాక్స్ వ‌సూలు చేశారు. ఆ త‌ర్వాత‌ ప్ర‌తి ఏడాది పెంచుకుంటూ పోయారు. 2023 నాటికి రూ. 1824 కోట్ల టోల్ ట్యాక్స్ వ‌సూలు చేశారు. ఈ 9 ఏండ్ల‌లోనే టోల్ ట్యాక్స్ 300 శాతం పెంచ‌డంతో.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కూడా విప‌రీతంగా పెరిగాయ‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మరి కేంద్రం ఈ లెటర్ ను పరిగణలోకి తీసుకుని టోల్ గేట్స్ చార్జెస్ పెంపు విషయంలో ఏమైనా మార్పులు చేస్తుందా అన్నది చూడాలి.