మేడిగడ్డ సందర్శనకు ఏర్పాట్లు చేయండి: అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

దీనిపై విచారణ జరగాల్సిందేనని వ్యాఖ్య

Minister Uttam Kumar Reddy conducted a review of the irrigation department

హైదరాబాద్‌ః సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం బిఆర్ఎస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఈ ప్రాజెక్టును సందర్శించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాజెక్టును నిర్మించిన సంస్థను, ఆ సమయంలో ఉన్న అధికారులను వెంట ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేశారు? ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు నిర్మాణం జరిగింది? ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు ఎంత? తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం చాలా తీవ్రమైన అంశమని, దీనిపై విచారణ జరగాల్సిందేనని చెప్పారు. ఈరోజు ఆయన నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

కాగా, నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంపై మంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడింది. ముందురోజు సాయంత్రం పిల్లర్‌ కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేశాం. ఆ తర్వాత కుంగడం తగ్గింది’’ అని చెప్పారు.