హైదరాబాద్‌ అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది : మంత్రి తలసాని

minister-talasani-srinivas-yadav-inaugurates-foot-over-bridge-in-secunderabad

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్‌ సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద రూ.5కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిని ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బేవరేజేస్ చైర్మన్ గజ్జెల నరేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ మహానగరం అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో వేలకోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడం కోసం నూతనంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణంతో పాటు రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయని వివరించారు. పాదచారులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్‌లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు ఏడు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

మరో 22 బ్రిడ్జిల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు. కార్యక్రమం కింద నాలాల అభివృద్ధితో పాటు పూడిక తొలగింపు పనులు జరుగుతున్నాయని తెలిపారు. నాలాల అభివృద్ధితో ఎన్నో సంవత్సరాల నుంచి నాలా పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దీపిక, కొలన్ లక్ష్మి, మహేశ్వరి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఈ అనిల్ రాజ్, డీసీ ముకుంద రెడ్డి, ఈఈ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/