అంగన్ వాడీ ఉద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్

పంచాయితీ రాజ్ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క అంగన్ వాడీ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్ వాడీలుగా అప్ గ్రేడ్ కు సంబంధించిన ఫైల్ పై మంత్రిగా తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్క స్వయంగా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.7500 జీతం పొందుతున్న మినీ అంగన్ వాడీ టీచర్లు ఇకపై రూ.13,500 పొందుతారని.. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 3989 హెల్పర్స్ ను నియమించుకోవచ్చని పేర్కొన్నారు.

అలాగే తన సొంతగ్రామానికి బస్సు సౌకర్యం కల్పించబోతుంది. ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు ఎట్టకేలకు బస్సు రానుంది. మంత్రి గ్రామానికి రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవటం.. అక్కడి నుంచి ప్రయాణం చేసేవాళ్లు కూడా పెద్దగా ఉండరు అన్న కారణంగా.. ఇన్నాళ్లు బస్సు నడపలేదు. వేరే ఊర్లకు వెళ్లాలంటే.. సొంత వాహనాలు లేదంటే ఆటోలే దిక్కు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలవుతున్న నేపథ్యంలో.. అసు బస్సు సౌకర్యమే లేనప్పుడు ఏ పథకం పెడితే ఏంటీ అంటూ ఆ మార్గంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పలు దినపత్రికల్లో రావటంతో.. ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. త్వరలోనే ఈ రూట్‌లో బస్సు నడిపించనున్నట్టు వరంగల్‌-2 డిపో మేనేజర్‌ సురేశ్‌ తెలిపారు. పత్తిపల్లి నుంచి పొట్లాపూర్‌ మార్గంలో బస్సును నడిపించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.