గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం

ప్రసంగంలో… ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి… మున్ముందు ఎలా ఉంటుంది? అనే అంశాలు

telangana-cabinet-approves-governor-speech

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్లో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ తొలి ప్రసంగం కాబట్టి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే అంశంపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? మున్ముందు ఎలా ఉండబోతుంది? అనే అంశాలతో గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నట్లుగా సమాచారం.

ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో రెండు గ్యారెంటీలలో కొన్ని అంశాలను అమలు చేస్తోంది. మిగతా గ్యారెంటీలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. కాగా, ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ప్రసంగిస్తారు.