నేను లేకుండానే భూమి పూజ చేసారంటూ మంత్రి రోజా ఆగ్రహం

వైస్సార్సీపీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో మరోసారి వర్గపోరు బయటపడింది. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ చేశారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే రోజా లేకుండానే రైతు భరోసా కేంద్రానికి భూమిపూజ చేయడం రాజకీయ చర్చకు దారి తీసింది. నిండ్ర మండలం కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ కార్యక్రమాన్ని శ్రీశైలం బోర్డు చైర్మెన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి హాజరయ్యారు. ఇలాంటి సమయంలో మంత్రిగా ఉన్న తనను నియోజకవర్గంలో బలహీన పరిచే విధంగా కుట్ర చేస్తున్నారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలే ఇలా చేస్తే.. రాజకీయాలు చేయడం కష్టమని రోజా అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో రోజా మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకు వచ్చింది.

ఆ ఆడియో మెసేజ్‌లో తనకు సమాచారం ఇవ్వకుండా భూమి పూజ ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో బలహీన పరిచే కుట్ర జరుగుతోందని రోజా ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ వాళ్లు నవ్వుకునే విధంగా, వారికి సపోర్ట్ చేస్తున్నారని పార్టీలో కొందరి నేతల తీరును విమర్శించారు. తనకు నష్టం జరిగేలా పార్టీని దిగజారుస్తూ భూమి పూజ చేయడం ఎంత వరకు సమంజసమని రోజా మాట్లాడినట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ గా మారింది.