ఏపీ అసెంబ్లీ నుండి అచ్చెన్నాయుడు, బి.అశోక్ సస్పెండ్

ఏపీ అసెంబ్లీ నుండి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బి.అశోక్ లను స్పీకర్ సస్పెండ్ చేసారు. ఏపీ అసెంబ్లీ లో రెండో రోజు కూడా అదే గందరగోళం నెలకొంది. మొదటి రోజు ఎలాగైతే టీడీపీ నేతలు పోడియం చుట్టుముట్టి చంద్రబాబు ఫై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసారో..రెండో రోజు కూడా అదే తరహాలో డిమాండ్ చేయడం తో పలుమార్లు స్పీకర్ అసెంబ్లీ ని వాయిదా వేశారు. ఇదే క్రమంలో సభలో వీడియో తీసినందుకు గాను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బి.అశోక్ లను అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు వీరిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ సభ్యులపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. సభలో ఏది పడితే అది.. ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదంటూ సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి. టీడీపీ సభ్యులు తమను అంత సులువుగా తీసుకోవద్దంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు బుగ్గన. అయితే, గురువారం సభలో తమను యూజ్‌లెస్‌ ఫెలోస్ అన్నారంటూ స్పీకర్‌తో టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ తీరు సరిగా లేదంటూ వాదనకు దిగారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో ఎదురుదాడికి దిగారు వైసీపీ సభ్యులు. ఇలా టీడీపీ సభ్యుల నిరసన, వైసీపీ సభ్యుల కౌంటర్‌తో సభకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.