మునుగోడు ప్రచారంలో ఈటెల సంచలన ఆరోపణలు

మునుగోడు పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యముగా బిజెపి – టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నువ్వా..నేనా అన్నట్లు కొనసాగుతుంది. పార్టీల నేతలంతా కూడా మునుగోడు ప్రచారంలో పాల్గొంటూ ఒకరి ఫై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రచారం లో పాల్గొని , టిఆర్ఎస్ ఫై , కేసీఆర్ ఫై పలు ఆరోపణలు చేశారు.

రాజగోపాల్ రెడ్డి గొంతు అసెంబ్లీలో వినిపించకుండా చేయడం కోసం హైదరాబాదులో అక్రమంగా సంపాదించుకున్న వేల కోట్ల రూపాయలు మునుగోడుకు తీసుకొచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి మీద ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు దాడి చేస్తున్నారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇక్కడ అడ్డాపెట్టి ఓడించాలని చూస్తున్నారని, 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలను గ్రామ గ్రామానికి కేటాయించారన్నారు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో బాగా కొట్లాడుతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అందుకే ఆయన గొంతు నొక్కాలని అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వ వద్ద ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళా సంఘాల రుణాలకు వడ్డీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, డబుల్ బెడ్ రూమ్ కట్టడానికి డబ్బులు లేవు, కానీ వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి వాటిని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. పసునూరు గ్రామానికి కూడా స్వయంగా మంత్రులే డబ్బులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలతో పంచిపెట్టే దుస్థితికి ఎందుకు దిగజారారని ప్రశ్నించారు.