కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం: ఖర్గే

మోడీ, కెసిర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఆపలేరని వ్యాఖ్య

Mallikarjun Kharge

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌కు పదవీ విరమణ సమయం వచ్చేసిందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో ఐదు హామీలను ఇచ్చి వాటిని అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొలి మంత్రివర్గంలోనే ఆమోదిస్తామని ఖర్గే చెప్పారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. బిజెపి, బీబిఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. బిఆర్ఎస్‌పై బిజెపి నేతలు విమర్శలు తగ్గించారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాని నరేంద్రమోడీ పరస్పర విమర్శలు మానేశారన్నారు. వారిద్దరు కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా ఆపలేరన్నారు. బిఆర్ఎస్ మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని స్వయంగా చెప్పాడని, అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.