ఆ రెండు యుద్ధాల్లోనూ మనమే గెలుస్తాం

ఓవైపు కరోనా, మరోవైపు సరిహద్దుల్లో ఘర్షణ..అమిత్ షా

Home Minister Amit Shah

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్‌ ఇప్పుడు రెండు యుద్ధాలు చేస్తోందని, ప్రధాని నేతృత్వంలో రెండు యుద్ధాల్లోనూ మనమే ఘన విజయం సాధించనున్నామన్నారు. దేశంలో కరోనాతో, సరిహద్దుల్లో చైనాతో ఇండియా యుద్ధం చేస్తోందని అన్నారు. చైనాను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. చైనాతో నెలకొన్న విభేదాలపై ఎవరు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలు నమ్మబోరని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఈ విషయంలో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని అమిత్ షా హితవు పలికారు. భారత సైనికులు అత్యంత వీరోచితంగా పోరాడుతున్నారని, ఇటువంటి సమయంలో చైనా, పాక్ లకు లాభం చేకూర్చేలా వ్యాఖ్యలు చేయడం ఏంటని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోవడంపై స్పందిస్తూ, కేసులు అధికంగా ఉన్న కంటైన్ మెంట్ జోన్ లలో ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలను నిర్వహిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఢిల్లీ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని నుంచి తనకు ఆదేశాలు అందాయని, కరోనా కట్టడి విషయంలో ఢిల్లీ ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోందని, ప్రభుత్వానికి కేంద్రం నుంచి తగు సహాయ, సహకారాలను అందిస్తామని ఆయన తెలియజేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/