మునుగోడు యూత్ ను టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్

minister-ktr-hot-comments-on-munugode-by-poll

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు పైనే అందరి చూపు ఉంది. ప్రధాన పార్టీలు అన్ని కూడా మునుగోడు ఉప ఎన్నిక ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచార సమయం ముగియనున్న నేపథ్యంలో నేతలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేశారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ యూత్ ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఆయన చేసిన ట్వీట్ చూస్తే అర్ధమవుతుంది.

ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ, గ్రామీణ రంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన, ప్రైవేట్ పరిశ్రమల నెలకొల్పనతో రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావడానికి కృషి చేస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. మునుగోడులో యువతకు ఉద్యోగాలు అందించాలనే ఉద్దేశ్యంతోనే ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడను దండు మల్కాపురంలో నెలకొల్పామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెలకొల్పిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

సుమారు 35 వేలమంది స్థానిక యువతకు ఉపాధిని అందించే ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా వస్తోందన్నారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా శరవేగంగా నిర్మాణం అవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రభుత్వరంగంలో శరవేగంగా ఉద్యోగాల భర్తీ, గ్రామీణరంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన చేస్తూ, మరోవైపు ప్రైవేటు రంగంలో కూడా వేలాది పరిశ్రమల స్థాపన ద్వారా లక్షలాది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.