దేశ ప్రజల చూపు కెసిఆర్ నాయకత్వం వైపుః మంత్రి కెటిఆర్

నాటి ఉద్యమనాయకుడే నేడు దేశంలో ఉత్తమ పాలకుడని కితాబు

minister-ktr-speech-in-telangana-assembly-budget-session

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. నాటి ఉద్యమ నాయకుడే నేడు దేశంలోనే ఉత్తమ పాలకుడని అన్ని రకాల సంస్థలు చెబుతున్నాయని సీఎం కెసిఆర్ ను ప్రస్తుతించారు. కెసిఆర్ పాలనే తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని గర్వంగా చెప్పుకోగలమని అన్నారు.

ఈ ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణకు కరెంటు కష్టం లేదు… తాగునీటి తన్నులాట లేదు, పేకాట క్లబ్లు లేదు, గుడుంబా గబ్బు లేదు, ఇంటి పర్మిషన్ కు ఇబ్బంది లేదు, ఉగ్రవాదుల ఊసు లేదు, బాంబు పేలుళ్ల భయం లేదు, మతఘర్షణల ముచ్చటే లేదు, కర్ఫ్యూల కలకలం అంతకన్నా లేదు, గంగా జమునా తెహజీబ్ కు ఢోకా లేదు, పరిశ్రమలకు పవర్ హాలీడే లేదు, పెట్టుబడిదారులకు పైరవీకారుల బెడద లేదు, ఉపాధి అవకాశాలకు, కష్టించేవాళ్లకు తెలంగాణలో కొదవ లేదు, ప్రభుత్వంలో పైరవీకారులకు అడ్రెస్ లేదు, పథకాల కోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, సుస్తీ చేస్తే ఏమవుతుందో అనే ఆలోచన బస్తీల్లో లేదు, మంచం పట్టిన మన్యం అనే వార్తలు లేవు, పిల్లల చదువులపై తల్లిదండ్రులకు బెంగ లేదు, అభివృద్ధి పనులకు ఆటంకం లేదు, సంక్షేమంలో మన ప్రభుత్వానికి తిరుగులేదు, తెలంగాణ మోడల్ కు ఈ దేశంలో సాటి మరొకటి లేదు…. అందుకే దేశం చూపు తెలంగాణ వైపు, దేశ ప్రజల చూపు కెసిఆర్ నాయకత్వం వైపు ఉంది అంటూ వివరించారు.

“విజన్ ఉండగానే సరిపోదు… చిత్తశుద్ధి ఉండాలి, వాక్ శుద్ధి ఉండాలని కెసిఆర్ చెబుతుంటారు. తదేక దీక్షతో పనిచేస్తే లక్ష్యాలు నెరవేరతాయి తప్ప, ఊకదంపుడు ఉపన్యాసాలు, నోరు, నాలుక ఉన్నాయి కదా అని ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే ఉపయోగం ఉండదు. వేష ఆడంబరాలు, రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం, డైలాగులు కొట్టడం, వాక్ ఆడంబరాలు… వీటివల్ల ఏమీ ఒరగదు. తెలంగాణ ఏర్పడినప్పుడు నెలకొన్న అపోహలన్నీ పటాపంచలు చేశాం” అని వెల్లడించారు. ఈ సందర్భంగా కెటిఆర్ పల్లె పల్లెనా పల్లేరు మొలిచే పాలమూరులోనా అంటో ఓ గేయాన్ని ప్రస్తావించారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించుకుండా పాలన సాగిస్తున్నామని, తెలంగాణ అభివృద్ధి ఇవాళ దేశంలోనే చర్చనీయాంశంగా మారిందని అన్నారు. ఇవాళ పాలమూరులో 11 లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయంటే సంతోషంతో కడుపు నిండిపోయిందని తెలిపారు. ఈ క్రమంలోనే సేతానం ఏడుందిరా తెలంగాణ చేలన్నీ బీళ్లాయరా… అంటూ సాగే గోరటి వెంకన్న పాటను కూడా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు పురుగుల మందే నీకు పెరుగున్నమైందా అని ఒకప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితిపై కవులు రాసుకున్నారని, కానీ అలాంటి పరిస్థితులన్నీ అధిగమించి, ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుందని వివరించారు.

“కెసిఆర్ పాలనలో తెలంగాణ అద్భుతరీతిలో ముందుకు పోతోంది. అటు గుజరాత్ లో పరిశ్రమలకు పవర్ హాలీడేలు ఇస్తున్నారు… అక్కడ నీటి కొరత ఉంది” అని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉందని గూగుల్ లో కొడితే తెలంగాణలోనే ఉందని సమాధానం వస్తుందని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెబుతోందని, మీటర్లు పెట్టేది లేదని తేల్చిచెబుతున్నామంటూ కెటిఆర్ తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. కెసిఆర్ ఉన్నంత వరకు మీ పప్పులు ఉడకవు అని హెచ్చరించారు.