భద్రాద్రి రామ‌య్యను ద‌ర్శించుకున్న మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

భద్రాచల రామయ్యను సతీసమేతంగా దర్శించుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి . బుధువారం భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత భ‌క్తులకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన జ‌ల‌ప్రసాదాన్ని (ఆర్వో ప్లాంట్) మంత్రి ప్రారంభించారు. ఇక రేపు జరగనున్న రామయ్య కల్యాణానికి వేదికను ముస్తాబు పనులు పూర్తి చేసారు. విద్యుత్ కాంతుల మధ్య దేదీప్యమానంగా ఆలయంతో పాటు ప్రాంగణాలు మెరిసిపోతున్నాయి. వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికార్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పుణ్యక్షేత్రం రామనవమి శోభను సంతరించుకుంది. స్వాగత ద్వారాలు.. చలువ పందిళ్లు.. చాందినీ వస్త్రాలంకరణలు.. విద్యుద్దీపకాంతుల్లో రామాలయ ప్రాంగణం వెలిగిపోతుంది.

సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన గురువారం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో నిర్వ హించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వ హించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈ కల్యాణాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. ఎదుర్కోలు ఉత్సవం, శ్రీరామనవమి, మహా పట్టాభిషేకాలను పురస్కరించుకొని సీతారాములను తీసుకెళ్లే మార్గాన్ని దేవస్థానం అధికారులు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటికే పరిశీలించారు. రామ నవమి ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క కల్యాణ మహోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రూ. కోటి రూపాయిలు మంజూరు చేసారు.