బిఆర్ఎస్ మేనిఫెస్టోలో త్వరలోనే హిళ‌ల‌కు శుభ‌వార్త : మంత్రి హ‌రీశ్‌రావు

minister-harish-rao-says-brs-manifesto-will-announce-good-news-to-women-in-telangana-state

కొడంగ‌ల్ : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు కోస్గిలో 50 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.
త్వ‌ర‌లోనే బిఆర్ఎస్ మేనిఫెస్టోను సిఎం కెసిఆర్ విడుద‌ల చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు. బిఆర్ఎస్ మేనిఫెస్టోలో మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త వినిపిస్తాం అని ఆయ‌న పేర్కొన్నారు.

మహిళల కోసం సిఎం కెసిఆర్‌ అనేక కార్యక్రమాలు అమ‌లు చేశార‌ని మంత్రి తెలిపారు. కల్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్, గృహలక్ష్మి ఇలా అనేక ప‌థ‌కాలు అమ‌లు చేశార‌ని గుర్తు చేశారు. త్వరలో బిఆర్ఎస్ మేనిఫెస్టో వస్తుంది. మహిళలను మరింత బలోపేతం చేసే విధంగా ఉంటుంది. మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు మేనిఫెస్టోలో ఉంటాయి. త్వరలో శుభవార్త వింటారని మంత్రి స్ప‌ష్టం చేశారు.

కోస్గి, కొడంగ‌ల్‌లో ఒక‌ప్పుడు మంచి నీటి క‌ష్టాలుండేవి.. మూడొద్దుల‌కు ఒక‌సారి నీళ్లు వ‌చ్చేవ‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ట్యాంక‌ర్ల వెంట నీళ్ల కోసం ప‌రుగెత్తేవారు. గ‌తంలో బోరింగ్‌లు కొట్టి, నీల్లు మోసి ఇబ్బంది ప‌డ్డారు. ఇప్పుడు ఇంటింటికీ న‌ల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నాం. కొడంగ‌ల్ ఆడ‌బిడ్డ‌ల క‌ష్టాలు సిఎం కెసిఆర్‌ తీర్చారు. రేవంత్ రెడ్డి గెలిచి ఉంటే మ‌రో 10 ఏండ్లు అయినా మంచినీళ్లు రాక‌పోయేవి. మీ పక్కనే కర్ణాటక ఉంది. అక్కడ కల్యాణ లక్ష్మి ఉందా. 12 లక్షల పెళ్లిళ్లకు రూ. 11 వేల కోట్లు ఇచ్చింది బిఆర్ఎస్ ప్ర‌భుత్వం అని మంత్రి స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నేను రాను బిడ్డో స‌ర్కార్ ద‌వాఖానాకు అనేటోళ్లు. ఇప్పుడు కెసిఆర్ నాయ‌క‌త్వంలో పోదాం ప‌దా బిడ్డ స‌ర్కార్ ద‌వాఖానాకు అనే అంత గొప్పగా ఆస్ప‌త్రుల‌ను అభివృద్ధి చేశాం. పైసా ఖ‌ర్చు లేకుండా కాన్పు చేసి కెసిఆర్ కిట్ అందిస్తున్నాం. కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్ ఈ ప‌ని చేసిందా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.