చంద్రబాబు అరెస్టుపై స్పందించిన మంత్రి హరీష్ రావు

Minister Harish Rao related to Chandrababu arrest

హైదరాబాద్‌ః టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులోఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్రం అన్ని రంగాలలో ముందుంది.. పాపం చంద్రబాబు అరెస్టు అయినట్టున్నారు. ఈ సమయంలో ఆయన గురించి మాట్లాడకూడదు కానీ.. ఆయన గతంలో ఐటి ఐటి అనేవారు.. నిజానికి హైదరాబాద్ లో ఐటీ కెసిఆర్‌ వల్ల అభివృద్ధి అయింది. పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి జరిగింది. తెలంగాణ వచ్చినప్పుడు మూడు లక్షలు ఉన్న ఐటీ ఉద్యోగాలు నేడు 10 లక్షలకు చేరాయి” అన్నారు.

ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం టిడిపి లీగల్ సెల్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. 437 (1) కింద బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.