ఇబ్రహీంపట్నం ఘటనపై స్పందించిన మంత్రి హరీష్ రావు

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు మంత్రి హరీష్ రావు చికిత్స తీసుకుంటున్న మహిళలను పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన హరీష్ రావు.. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పేషంట్లు పూర్తిగా కోలుకున్న తరువాతనే ఇంటికి పంపించాలని డాక్టర్లకు చెప్పారు.

ఈ ఘటనలో నలుగురు మహిళలు చనిపోవడం బాధాకరమని..ఇన్ఫెక్షన్ వల్లే మహిళలు చనిపోయారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని హరీష్ రావు తెలిపారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని.. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హరీష్ రావు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు సాగుతోందన్నారు. పేషెంట్ సహాయకులకు ఇప్పటికే 10వేలు అందించామని..భవిష్యత్ లో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.