ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను అక్రమంగా అరెస్ట్ చేసారని..వెంటనే ఆయన్ను విడుదల చేయాలంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నేతలు, రాజాసింగ్ మద్దతుదారులు గణేష్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. రాజాసింగ్ కు మద్దతుగా ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

భక్తులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. నిరసనకారులను అడ్డుకున్నారు. వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించినప్పటికీ వారు శాంతించలేదు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులను అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇక ఈరోజు ఉదయం ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసారు గవర్నర్ తమిళసై. ఉదయం నుండే దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. ప్రతి చోటా విగ్రహ ప్రతిష్ఠాపన, ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భక్తులంతా భక్తిలో మునిగిపోయారు. ఇక హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. లంబోధరుడిని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు. గణనాథుని తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అందరిని ఐకమత్యంగా ఉంచేదే గణేష్ ఉత్సవాలు అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

వీరితో పాటు మహాగణనాథుడికి మంత్రి తలసాని, ఎమ్యెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొని వినాయకుడికి మహా హారతి ఇచ్చారు. వీరితో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం బడా గణేశ్ ని సందర్శించారు. అంతకుముందు ఈ ఖైరతాబాద్ వినాయకుడికి భారీ లడ్డును నిర్వాహకులు సమర్పించారు.