నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ తెలిపిన మంత్రి హరీష్ రావు

,

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ తెలిపారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లను జారీ చేయడం జరిగింది. ఆయా పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ కూడా మొదలైంది. ఇక మిగిలిన విభాగాల్లోని పోస్టులకు సంబంధించిన జాబ్‌ ప్రకటనలను కూడా వెంటవెంటనే ప్రకటించనుంది. దీనిలో భాగంగా టీఎస్పీయస్సీ గ్రూప్‌ -4 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

గ్రూప్‌-4 ఉద్యోగాలకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని విమర్శించారు. యువత జీవితాలను నాశనం చేసేలా బీజేపీ సర్కార్‌ నిర్ణయాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూలులో పోలీసు శిక్షణ పొందుతున్న 300 మంది అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాలి. పోలీసు కొలువు చేజిక్కించుకునేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. శ్రమించి కొలువు సాధించాలని అన్నారు.