నా చొక్కా పట్టుకునే దమ్ము వైస్సార్సీపీ నేతలకు ఉందా..? – పవన్ కళ్యాణ్

నా చొక్కా పట్టుకునే దమ్ము వైస్సార్సీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ ఇళ్లను పరిశీలించిన పవన్..వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. వైస్సార్సీపీ అవినీతికి చిరునామాగా మారిందని , జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.12 వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ఏనాడైనా ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైస్సార్సీపీ పట్టించుకుందా? అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి ఏంచేశారని వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, వైస్సార్సీపీ నేతలను చొక్కాలు పట్టుకుని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, అయితే తాను ఢిల్లీ వెళ్లనని ఎక్కడి సమస్యను అక్కడే తేలుస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నా చొక్కా పట్టుకునే దమ్ము వైస్సార్సీపీ నేతలకు ఉందా? అని సవాల్ విసిరారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుంది.. నిధులు పక్కదారి పట్టాయన్నారు. ప్రభుత్వం చెప్పిన ధర ఒకటి ప్రభుత్వం పెద్దలు దోచుకుంది మరొకటి.. అసలు ఇళ్ల పేరుతో కేటాయించిన రూ. 23,400 కోట్లలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారంటూ ఆరోపణలు చేశారు. జగనన్న ఇళ్ల పేరుతో జరిగిన అవినీతిపై ప్రధాని మోడీకి స్వయంగా తానే నివేదిక ఇస్తానని తేల్చి చెప్పారు. ప్రభుత్వ అక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ మోసాన్ని ప్రజలంతా గుర్తించాలని.. ఉత్తరాంధ్రులకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని ఆకాంక్షించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామన్నారు.