జగనన్న ఇళ్ల పేరుతో కోట్లలో స్కామ్..ప్రధానికి పిర్యాదు చేస్తానన్న పవన్

జగనన్న ఇళ్ల పేరుతో కోట్లలో స్కామ్ జరుగుతుందని , దీనిపై ప్రధాని మోడీకి పిర్యాదు చేస్తానని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ ఇళ్లను పరిశీలించిన పవన్..జగనన్న ఇళ్ల పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు.

ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుంది.. నిధులు పక్కదారి పట్టాయన్నారు. ప్రభుత్వం చెప్పిన ధర ఒకటి ప్రభుత్వం పెద్దలు దోచుకుంది మరొకటి.. అసలు ఇళ్ల పేరుతో కేటాయించిన రూ. 23,400 కోట్లలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారంటూ ఆరోపణలు చేశారు. జగనన్న ఇళ్ల పేరుతో జరిగిన అవినీతిపై ప్రధాని మోడీకి స్వయంగా తానే నివేదిక ఇస్తానని తేల్చి చెప్పారు. ప్రభుత్వ అక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ మోసాన్ని ప్రజలంతా గుర్తించాలని.. ఉత్తరాంధ్రులకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని ఆకాంక్షించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామన్నారు.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం తనను నమ్మాలని.. తనపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు తాను సిద్ధమని పిలుపునిచ్చారు. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని.. జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దామని.. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడాలని.. బలంగా ఎదుర్కోవాలని సూచించారు. పోలీసులు కేసులు పెడితే మీతో పాటు నేనూ జైలుకు వస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.