సివిల్స్ ర్యాంకర్లకు అల్పాహార విందును ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు 

తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచారని ప్రశంస

హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తా చాటారు. మన దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో జయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలో సివిల్స్ ను క్రాక్ చేసిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తన నివాసంలో అల్పాహార విందును ఇచ్చారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలతతో పాటు సివిల్స్ ర్యాంకర్లు హరీశ్ ను కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ విజేతలను ఆయన సన్మానించారు.

ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. సివిల్స్ లో ర్యాంకులు సాధించి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. స్వయంగా ఐఏఎస్ అధికారిణి అయిన బాలలత హైదరాబాదులో ఐఏఎస్ అకాడమీని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పారు. ఇప్పటి వరకు ఆమె వంద మందికి పైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం మనందరికీ గర్వకారణమని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో సుధీర్‌కుమార్‌రెడ్డి (ర్యాంక్‌-69), అరుగుల స్నేహ (136), బీ చైతన్య రెడ్డి (161), రంజిత్‌కుమార్‌ (574), స్మరణ్‌రాజ్‌ (676)తో పాటు ఎన్ఆర్ఐ మల్లవరపు సరిత ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/