ఏపీ కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లలో ఫోర్జరీకి అవకాశం లేదన్న మంత్రి ధర్మాన

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లపై టిడిపి అడిగిన ప్రశ్నకు మంత్రి ధర్మాన సమాధానం

Minister Dharmana Prasada Rao Speech at AP Assembly

అమరావతి : ఈ ఉదయం 9 గంటలకు నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లపై టిడిపి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ధర్మాన ప్రసాదరావు సమాధానం ఇస్తూ.. రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్టు తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లలో ఫోర్జరీ జరిగేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. జారీ చేసిన కాపీని నకిలీ అనడానికి లేదని, బ్యాంకులు కూడా అదే ఒరిజినల్ అని అంగీకరిస్తున్నాయని వివరించారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. దీనివల్ల ప్రభుత్వ సేవలన్నీ ప్రజల వద్దకే వస్తున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కిలారు రోశయ్య మాట్లాడుతూ.. గడగడపకూ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లామని, కుల, మత, పార్టీల భేదం లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రతీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల పథకం కోసం బడ్జెట్ కేటాయించినట్టు తెలిపారు. దేవాలయ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, మరిన్ని దేవాలయాలను ఈ పథకంలోచేర్చాల్సి ఉందని తెలిపారు.

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పంట ఉత్పత్తులకు గిట్టుబాట ధర ఉండడం లేదన్న బెంగ ఇక రైతులకు ఉండబోదన్నారు. సీజన్ ప్రారంభానికి ముందే సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని మద్దతు ధరలు ప్రకటించారని ప్రశంసించారు. తొలిసారి రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే సీఎం యాప్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో మద్దతు ధర ప్రకటన పోస్టర్లను ప్రదర్శిస్తామని తెలిపారు.