చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దు

chandrayangutta flyover opening cancelled

చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయింది. రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవ‌ర్‌ను ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ ప్రారంభించాలని అనుకున్నారు. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేసారు. కానీ పాతబస్తీలో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 27న ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పాత బస్తీలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ ఫ్లైఓవర్ పూర్తి కావడంతో.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ఎంతో సమయం కలిసిరానుంది. అదేవిధంగా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలకు కూడా ఇక చెక్ పడినట్లేనని చెప్పొచ్చు. హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌డీపీ చేపట్టిన ఒక్కో అభివృద్ధి పని అందుబాటులోకి వస్తుంది. ఎస్‌ఆర్‌డీపీ ద్వారా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన 41 పనుల్లో దాదాపు 30 పూర్తయ్యాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ప్రభుత్వం ఫ్లై ఓవర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆరాంఘర్ నుంచి మీర్ ఆలంట్యాంక్ వరకు నిర్మించే ఫ్లైఓవర్ జీహెచ్ఎంసీలోనే అతి పొడవైనది. దాని నిర్మాణ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. నాగోల్ వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయి.